పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
పాలకుర్తి జాతర ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, భక్తులు సంతృప్తిగా శ్రీ సోమేశ్వర, లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) పై అన్ని శాఖల అధికారులతో దేవస్థాన కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
శివరాత్రి ఒక్కరోజే 1 లక్ష 50 వేల భక్తులు సందర్శించుకునే పాలకుర్తి జాతరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. 2025 ఫిబ్రవరి 25,26,27,28,29 తేదీల్లో నిర్వహించనున్న పాలకుర్తి జాతర పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డిఆర్డిఓ కృష్ణవేణి, డీపీఓ వసంత, ఆర్డీఓ డి ఎస్ వెంకన్న, సీఐ మహేందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్, ఈఓ మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

