అక్రమ కూల్చివేతలపై హైకోర్టు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీకెండ్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఎంతవరకు న్యాయసమ్మతం అనే ప్రశ్నను కోర్టు ఎదుట ఉంచింది. “ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా?” అంటూ హైకోర్టు హైడ్రాను తీవ్రంగా ఆక్షేపించింది. ఒక్క రోజు మాత్రమే డాక్యుమెంట్లు సమర్పించడం ఎలా సాధ్యమవుతుందని కోర్టు ప్రశ్నించింది.
ఈ సమయంలో, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన సామ్రెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి తన ఆస్తిని అక్రమంగా కూల్చివేశారని హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన జస్టిస్ కె. లక్ష్మణ్, సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హైడ్రాను హెచ్చరించారు. కోర్టు సెలవులు, శనివారం, ఆదివారాల్లో అక్రమ కూల్చివేతలు జరపడం ఎలాంటి న్యాయపరమైన ప్రమాణాలకు అనుగుణమైందో, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

