ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చినా, చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో దిల్లీ ఫలితాలు స్పష్టంగా చూపించాయని చెప్పారు. కేజ్రీవాల్, సిసోదియా లాంటి నేతలను ప్రజలు ఓడించారని, దిల్లీ ప్రజలు లిక్కర్ స్కాంపై తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పు రావాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో మరో ఓటమిని చవిచూసిందని విమర్శించారు. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయ్యిందని, గెలవాలనే లక్ష్యం కాంగ్రెస్‌కు లేదని, మోదీని ఓడించడమే వారి ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగటం కాదు, రాజ్యాంగ విలువలను పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారని, పదేళ్లుగా అభివృద్ధి లేకుండా ఉన్న దిల్లీ ఇక అభివృద్ధి చెందనుందని కిషన్ రెడ్డి తెలిపారు.

