భారతీయుల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎయిమ్స్ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న వ్యాధుల్లో 56% అనారోగ్యాలు ఆహారం కారణంగా ఏర్పడుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అధిక నూనె, ఉప్పు, చక్కెరతో కూడిన జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం అధికంగా ఉండటంతో గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ప్రకారం, సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌ల అధిక స్థాయిలో ఉండే ఆహారం కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా నగర జీవనశైలి, రాత్రిపూట జంక్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల యువతలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రజలు బహుళజాతీయ కంపెనీల ప్రకటనలకు ప్రభావితమై బయటి ఆహారం ఎక్కువగా తీసుకుంటుండటంతో, దీని ప్రభావం భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంచి జీవనశైలిని కొనసాగించాలంటే సాంప్రదాయ ఆహారపు అలవాట్లను తిరిగి అలవరచుకోవడం, సేంద్రీయ ఆహారం, తాజా కూరగాయలు, రసాయన రహిత ధాన్యాలను ఎక్కువగా ఉపయోగించడం అవసరమని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రోత్సహించడం ద్వారా నెలకొన్న సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

