తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక నిర్ణయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం హైదరాబాద్‌లోని MCRHRD లో జరుగుతోంది. ముందుగా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన తర్వాత సీఎల్పీ సమావేశం కొనసాగనుంది. ఇందులో పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఎమ్మెల్యేలు-మంత్రుల మధ్య సమన్వయం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు చేయనున్నారు.
ఈ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసి రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరణ ఇవ్వనున్నారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ జనసభ, ఎస్సీ జనసభ పేరుతో ఈ సభలను ప్రజా చైతన్య వేదికలుగా మార్చాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ కీలక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

