అడుగు ఎఫెక్ట్
ఎమ్మెల్యేలతో భేటీలు!!
-తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై ఎఐసిసి సీరియస్
-నష్ట నివారణకు నడుం బిగించాలని అధిష్ఠానం ఆదేశం
-స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి దిశానిర్దేశం
-రంగంలోకి దిగిన సీఎం, పిసిసి, ఎఐసిసి పరిశీలకురాలు
-రెబెల్స్ తోపాటు ఎమ్మెల్యేలందరితో నేడు రేవంత్ భేటీ
-నాలుగు గ్రూపులుగా ఎమ్మెల్యేలు
– ముగ్గురు కీలక నేతల చర్చలు
– ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు
– మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం
– ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్తృత ప్రచారం
– స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో నష్ట నివారణకు ఓ ‘అడుగు’ పడింది. ‘అడుగు’లో ఫిబ్రవరి 3న ‘‘తిరుగుబాటా? తిరుగుబావుటా? టార్గెట్ ఎవరు? రేవంతా? పొంగులేటా?’’, ఫిబ్రవరి 4న ‘‘మంత్రివర్గమా? మా గోడు వినుమా..! ఏడాది దాటింది.. ఏమీ చేయలేకపోతున్నామయ్యా!’’ ఇదీ ఎమ్మెల్యేల మనోగతం’’ అనే శీర్షికలతో తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, ఎమ్మెల్యేల సమస్యలు, పరిష్కారాలతో కూడిన సమాచారంతో అడుగు డిజిటల్ మీడియా ఎక్స్లూజివ్ గా అందించిన వరస కథనాలకి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వం స్పందించింది. అంతర్గత సవరింపులకు, సర్దుబాట్లకు సమాలోచన చేస్తున్నది. అధిష్ఠానం దిశా నిర్దేశం మేరకు రెబెల్స్ తో పాటు ఎమ్మెల్యేందరితోనూ గురువారం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు నిధులు, విధులు అప్పగిస్తూనే, వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిణామాలపై ఎఐసిసి సీరియస్ అయిందా? ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం-అసంతృప్తి నేపథ్యంలో ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కస్సుబుస్సులాడారా? ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రాహుల్ రఫాడించారా? ఈ ఆదేశాలు, దిశానిర్దేశాలు ఎలా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే మిగతా పార్టీ ఎమెల్యేలందరినీ నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుతో ముగ్గురు ప్రత్యేక నేతలు భేటీ కానున్నారు. అనంతరం వారితో సీఎం సమావేశమై అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకుని అందుకు తగిన విధంగా నిధులు, విధులు, మంత్రులతో సమన్వయం, సీఎంగా తనతో తరచూ కలిసే అవకాశాలపై రేవంత్ చర్చించనున్నారు.
ముందుగా ఆ 8 మందితోనే భేటీ
ముందుగా ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు భేటీ కానున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో 8 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ కు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఏడాది గడిచినప్పటికీ, ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో ప్రజలు తిరుబాటు చేసే పరిస్థితులు వచ్చాయని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. భేటీ అయిన వారిలో అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), భూపతిరెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), మురళీనాయక్ (మహబూబాబాద్), కూచకుళ్ళ దామోదర్ రెడ్డి (నాగర్ కర్నూలు), సంజీవరెడ్డి(నారాయణ్ ఖేడ్), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), బీర్ల అయిలయ్య (ఆలేరు) ఉన్నారు. వారు ప్రత్యేకంగా సమావేశం ఎందుకు కావాల్సి వచ్చింది? మీడియాతో ఎందుకు మాట్లాడారు? వారి సమస్యలు ఏంటి? వారి పరిష్కారాలేంటి? అనే అంశాలపై ఓ క్లారిటీకి రానున్నారు.
ఎమ్మెల్యేలందరితోనూ సమావేశం
అనంతరం మంత్రులను కలుపుకుని, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎమ్మెల్యేందరితోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు సమావేశం కానున్నారు. వేర్వేరుగా ఎమ్మెల్యేల సమస్యలేంటి? ఉమ్మడిగా ఏమేమి ఉన్నాయి? వాటి పరిష్కార మార్గాలేంటి? వంటి అంశాలను చర్చించనున్నారు.
ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు
నియోజకవర్గాల పురోగతికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. కనీసం రూ.50 నుంచి రూ.100 కోట్ల చొప్పున ఎమ్మెల్యేకు ఇచ్చే విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శాఖల వారీగా వచ్చే నిధులు, రొటీన్ నిధులపై కూడా ఎమ్మెల్యేలకు సరైన అవగాహన కల్పించి, దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు తెలిసింది.
మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం
ఇదిలావుండగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సరైన సమన్వయం కుదిర్చే విధంగా ఈ సమావేశం సాగనుంది. మంత్రులు… ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలని, వారు తీసుకువచ్చే సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వారికి స్పష్టతనివ్వాలని సూచించనున్నారు. ప్రజా పనులపై వెంటనే స్పందించాలని మంత్రులను ఆదేశించనున్నారు. సమన్వయంతో కలిసికట్టుగా పని చేసే విధంగా విష్పష్టత రానుంది.
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్త్రుత ప్రచారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రజలను కలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుని, ప్రభుత్వ పథకాల అమలును వారికి వివరించాలని చెప్పనున్నారు. అధికారులను, ఎమ్మెల్యేలను మంత్రులు కలుపుకుని పోవాలని ఆదేశించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నదని, మిగతా అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ప్రజలకు వివరించాలని ఆదేశించనున్నారు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడుతున్న విషయాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు
రానున్న స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచే విధంగా సంసిద్ధండా ఉండాలి. ఈసారి స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం లభించనుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి. ఆ బాధ్యతలు జిల్లాల ఇన్ చార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలదేనని, స్థానిక ఫలితాలను బట్టి, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతులుంటాయని స్పష్టం చేయనున్నారు.

