అమెరికా నేవీ ఇటీవల అత్యాధునిక హై పవర్ లేజర్ ఆయుధం HELIOS ను విజయవంతంగా పరీక్షించింది. USS Preble యుద్ధ నౌకపై పరీక్షించిన ఈ లేజర్, మానవరహిత వైమానిక వాహనాలను (డ్రోన్లు) ధ్వంసం చేయగలదు. ఈ శక్తివంతమైన ఆయుధం శత్రు నౌకల సెన్సార్లను దెబ్బతీసేందుకు, కమ్యూనికేషన్ వ్యవస్థలను నిరోధించేందుకు కూడా ఉపయోగపడుతుంది. Lockheed Martin అభివృద్ధి చేసిన HELIOS, 60 కిలోవాట్లకు పైగా శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఐదు మైళ్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఓడ నుంచి నేరుగా శక్తిని గ్రహించడం వల్ల ఇంధన నిల్వ అవసరం లేకుండా నిరంతరంగా పని చేయగలదు.
ఈ లేజర్ ఆయుధం రక్షణ రంగంలో కీలకమైన విప్లవాత్మక మార్పుకు దారి తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇది యుద్ధాల రూపాన్ని మార్చవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అద్భుతమైన టెక్నాలజీకి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు, మీమ్స్ చేస్తున్నారు. కొందరు ఇప్పటివరకు కార్టూన్ సినిమాల్లో మాత్రమే చూసిన టెక్నాలజీ ఇపుడు నిజమవుతోందని పేర్కొనగా, మరికొందరు అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు మరింత శక్తివంతంగా మారిందని అభిప్రాయపడ్డారు. HELIOS విజయవంతమైన పరీక్షతో భవిష్యత్తులో మరిన్ని అధునాతన ఆయుధాలు అభివృద్ధి అయ్యే అవకాశముంది.

