మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీరోలు మండల కేంద్రంలో, డాన్స్ చేస్తూ ఇంటర్ విద్యార్థిని సపావట్ రోజా (16) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం రాత్రి పదో తరగతి విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, డీజే సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన రోజా, వేదికపై డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో రోజా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

