మణిపూర్‌లో జాత్యంతర హింసకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రేరేపకుడిగా ఉన్నారంటూ లీకైన ఆడియో క్లిప్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలో ఆ క్లిప్‌లోని గొంతు బీరేన్ సింగ్‌ది 93% మేర మ్యాచ్ అవుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (CFSL) ద్వారా మరోసారి పరిశీలించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.

