దేశంలో ‘జీబీఎస్’ అనే కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడులోనూ ఈ వైరస్ బయటపడింది. తాజాగా, తిరువళ్లూరు సమీపంలోని తిరువూరు ఎంజీఆర్ నగర్‌కు చెందిన వైదీశ్వరన్ (9) ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.
గత నెల 22న స్కూల్‌కు బయల్దేరిన సమయంలో వైదీశ్వరన్ కాళ్లు కదపలేకపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు వెంటనే వేపంపట్టు పీహెచ్సీకి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పంపించారు. అయితే, పరిస్థితి మరింత విషమించడంతో తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, నరాలు సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం ఎగ్మోర్ ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ ‘జీబీఎస్’ వైరస్ సోకిందని నిర్ధారణ అయింది.
అత్యవసర వైద్యం అందించినప్పటికీ, శనివారం వైదీశ్వరన్ మృతిచెందాడు. రాష్ట్రంలో ‘జీబీఎస్’ వల్ల సంభవించిన తొలి మరణం కావడంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరువూరు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు హెచ్చరించారు.

