అయోధ్యలో ఓ 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆమె కోసం కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా, గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆమె మృతదేహాన్ని గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలువలో గుర్తించారు. యువతిని వివస్త్రంగా, చేతులు, కాళ్లు తాళ్లతో కట్టివేసి, అమానుషంగా హత్య చేసినట్లు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబసభ్యులు పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ ఫిర్యాదుపై అధికారులు సమయానికి స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని ఆరోపించారు. గ్రామస్థులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ ఘటనపై ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. “యువతి రెండు మూడు రోజులుగా కనిపించకుండా పోయినా, పోలీసులు ఆమెను కాపాడలేకపోయారు. చివరకు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేస్తానని, తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ ప్రకటించారు. అయితే పార్టీ నేతలు ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని ఎంపీని కోరారు.

