తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం, మంత్రులు ఎన్నికల ఏర్పాట్లపై దూకుడు పెంచారు. ఉద్యోగులు, అధికారులతో వరుస భేటీలు నిర్వహించుకుంటూ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందుగా, ఫిబ్రవరి 1న బీసీ కుల గణనపై సబ్ కమిటీకి ముసాయిదా నివేదిక అందించనున్నారు. ఫిబ్రవరి 3న సబ్ కమిటీ సమావేశం, 5న క్యాబినెట్ భేటీ నిర్వహించి ముసాయిదాకు ఆమోదం తెలుపనుంది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి, 10 లేదా 12 తేదీల్లో రిజర్వేషన్ల అమలు చేపట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి మొదటి లేదా రెండో వారంలో పోలింగ్ పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, రేపటి నుంచి మూడు రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు నేతలు కార్యాచరణను ప్రారంభించారు.

