వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన “కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి దిశగా చేస్తున్న పనులను అక్కడి ప్రతినిధులతో పంచుకున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తనకు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణకు చెందిన గోదావరి, కృష్ణా నదులను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పంచుకుంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, “మేము అభివృద్ధి సాధించడం మా ప్రధాన ప్రాధాన్యత” అని తెలిపారు. ఆయన చెప్పారు, “తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలుగా అభివృద్ధి చెందాలన్నది మా లక్ష్యం. హైదరాబాద్, న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం.” తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడతుందని అన్నారు.
రేవంత్ రెడ్డి, పీవీ నరసింహరావు గారి సరళీకృత ఆర్థిక విధానాలు, రాజీవ్ గాంధీ గారి టెలికాం, కంప్యూటర్ రంగాలలో చేపట్టిన సంస్కరణలను ఉదాహరించి, “మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి, ఇవి రాజకీయాల వాస్తవికతలకి దూరంగా ఉంటాయి” అని చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను మెరుగుపర్చే క్రమంలో, పట్టణీకరణకు కీలక ప్రాముఖ్యత ఇస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో, మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి భాగం కోర్ అర్బన్ ప్రాంతం, ఇది ఓఆర్ఆర్‌లో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉంటుంది. రెండవ భాగం ఓఆర్ఆర్ నుండి 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, 65 శాతం తెలంగాణ నగర ప్రాంతంగా మారనుందని తెలిపారు. ఆర్ధిక వృద్ధి కోసం, గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు, చేపల ఎగుమతుల సహా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తుందని చెప్పారు. “మా అత్యంత పెద్ద బలం యువత మరియు హైదరాబాద్. మాకు నమ్మకం ఉంచండి, అభివృద్ధి విషయంలో మా విధానాలు సుస్థిరంగా ఉంటాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో, భారతదేశం-రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమీర్ సరన్ సంధానకర్తగా వ్యవహరించారు.

