యువత డ్రగ్స్ కి దూరంగా వుండాలి
యువత దేశాభివృద్ధికి ఆలోచించాలి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్ అవగాహన సదస్సు, భారీ ర్యాలీ
ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎల్ఏ యశస్విని, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు “సే నో టూ డ్రగ్స్” పేరుతో భారీ సదస్సును నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సమాజంపై కలిగే దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు యువత డ్రగ్స్ వైపు మళ్ళకుండా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “సే నో టూ డ్రగ్స్” అనేది కేవలం నినాదం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తవంగా పాటించాల్సిన ఒక సామాజిక బాధ్యతగా మలచాలని ఎమ్మెల్యే యశస్విని అన్నారు. యువత, విద్యార్థులు తమ జీవితాల్లో మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధన కోసం కృషి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నారు. అలాగే సమాజంలో అందరి బాధ్యతగా డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ….డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, నేరప్రవృత్తి పెరిగే ప్రమాదాలు ఉన్నాయి అన్నారు. పాలకుర్తిలో డ్రగ్స్ నివారణకు మనమంతా పూనుకోవాలని అన్నారు. యువత మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తే ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్లొద్దు అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యలను మరింత ఉద్గ్రతరం చేసి, శాశ్వతంగా ఈ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఆత్మీయ అతిథులుగా హాజరైన ఎక్సైజ్ డీఎస్పీ, పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. డ్రగ్స్ ద్వారా జరిగే అనర్థాలను వివరించారు.

ఈ సందర్భంగా అంతకముందు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. ర్యాలీ ద్వారా ప్రజల్లో డ్రగ్స్ వ్యతిరేక పోరాటం మీద చైతన్యం కలిగించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్లు, బొమ్మలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, కొడకండ్ల, పాలకుర్తి మార్కెట్ చైర్పర్సన్లు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

