ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ హెచ్.సి.ఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు, హెచ్.సి.ఎల్ సీఈవో సి.విజయకుమార్‌తో చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థాపించబడే ఈ సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో సేవలను అందిస్తుంది. క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ కేంద్రం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ సర్టిఫికేషన్‌ను పొందింది. దాదాపు 5,000 ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్న ఈ సెంటర్ హెచ్.సి.ఎల్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో కీలకంగా మారనుంది. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు.

