దిగి వచ్చిన ‘ కొండ ‘!
అనుయాయులే అండ!!
కార్మిక భవన నిర్మాణం వైపు అడుగులు
నష్ట నివారణకై చర్చలు
అడసు తొక్కనేల… కాలు కడగనేల… అనేది సామెత. కొండా దంపతుల విషయంలో ఇది మరోసారి రుజువైంది. అపారమైన రాజకీయ అనుభవం, సుదీర్ఘ పరిపాలన దక్షత, చిన్న పొరపాటుతో బూడిదలో పోసిన పన్నీరు అయ్యే పరిస్థితికి దారితీసింది. ఊరక(మౌనంగా)నే ఉంటే ఊబీ లోకి కూరుకుపోయే స్థాయికి చేర్చింది. అయితే రచ్చ రచ్చ అయిన ఈ మొత్తం వ్యవహారం నుంచి ఏకకాలంలో బయట పడాలంటే ఏమి చేయాలి? అదే స్థలంలో కార్మిక భవనం తిరిగి కట్టడం తప్ప వేరే దారే లేదని అంతర్గత చర్చల్లోనూ తేలిపోయింది. సరిగ్గా ఇప్పుడు కొండా దంపతులు అదే ఆలోచిస్తున్నారు. కార్మిక భవన నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.

కొబ్బరి కాయే కదా! అని కొడితే కొంప ముంచింది. ఉన్నది ఊడే దాకా తెచ్చింది. ఉప్పు నిప్పులా ఉండే ప్రతిపక్షాలను ఏకం చేసింది. ప్రజా, కార్మిక సంఘాలకు కలిపింది. చెల్లా చెదురైన మిల్లు కార్మిక కుటుంబాలను ఒక్కటి చేసింది. గత ప్రభుత్వంలో చేసిన పాపం, కొండా దంపతులకు పామై చుట్టుకుంది. పెద్ద ప్రజా ఉద్యమానికే దారి తీసింది. మౌనం మరింత నష్టం చేసింది. కాలం కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నష్ట నివారణకు నడుము బిగించింది.
వరంగల్ అజంజాహి కార్మిక భవన స్థలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఏ ముహూర్తాన కొబ్బరికాయ కొట్టారో!? కానీ, అప్పటి నుంచి కొండా దంపతులపై రాజకీయంగా విమర్శలు ఎక్కువయ్యాయి. ఓ వస్త్ర వ్యాపారికి మద్దతుగా నిలిచారన్న అపవాదు మూట కట్టుకోవడమే కాక, కార్మిక వర్గానికి నష్టం చేశారన్న విమర్శలు మొదలయ్యాయి.. ప్రధాన పత్రికలు, మీడియా, సోషల్ మీడియా అన్నింటా కొండా దంపతులపై ముప్పేట దాడి జరిగింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాజకీయంగా వరంగల్ తూర్పులో పుంజుకోవడం కొత్త తల నొప్పికి దారి తీసింది. స్వపక్షంలో విపక్షానికి కారణమైంది. సొంత గూటి లోనే వింత పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలోనే ప్రత్యర్థి వర్గం కార్మిక భవన అంశంలో విమర్శలు చేయడం, వ్యతిరేకంగా పని చేయడం కొండా మురళీధర్ రావు జీర్ణించుకోలేకపోయారు. ఓవైపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానం పావులు కదుపుతుండడం, మంత్రి వర్గం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిష్క్రమిస్తారని మీడియా కోడై కూస్తుండడం, సొంత నియోజకవర్గంలోనే తమకు వ్యతిరేక శక్తులు పుంజుకోవడం రాజకీయంగా ఇరుకున పడినట్లయింది. ఈ దశలో తన సహజ మొండి వైఖరిని ప్రదర్శించడమా? లేక కరాఖండిగా వ్యహరించడమా? లేక యుక్తిగా, ఉపాయంగా బయట పడటమా? అని కొండా దంపతులు తమ అంతరంగికులు, అనుయాయులు, శ్రేయోభిలాషుల తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారని తెలిసింది. ఈ దశలో మొండిగా ఉంటే మొదటికే మోసం రావచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయినట్లు తెలిసింది.
అన్ని విమర్శలకు చెక్
ఏక కాలంలో అన్ని విమర్శలకు చెక్ పెట్టాలని కొండా దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే నష్ట నివారణ చర్యలు చే పట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా నాలుగు రోజుల క్రితం ఇదే అంశంపై హైదరాబాద్ లో కొండ దంపతులు తమ ముఖ్య అనుచరులు, పలువురు కార్పొరేటర్లు ముఖ్య నేతలతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది.
కార్మిక భవనం కట్టాల్సిందే!
అజంజాహి కార్మిక భవనం కూల్చామని వస్తున్న విమర్శలు, అపవాదు నుంచి బయట పడాలంటే కార్మిక భవనం కూల్చిన చోటే అన్ని హంగులతో కొత్తగా భవనాన్ని కార్మికుల కోసం కట్టించాలన్నది కొండ వర్గీయులు కరాఖండిగా తేల్చి చెప్పారని తెలిసింది. ఇదే విషయాన్ని బాస్ కొండా మురళి దృష్టికి వారు తీసుకెళ్లడంతో ఆయన కూడా కార్మిక భవనం కట్టించే విషయంలో కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే విమర్శలకు పుల్ స్టాప్ పెట్టొచ్చని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మిక భవనం కట్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో అజంజాహి కార్మిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయాన్ని దావోస్ పర్యటనలో ఉన్న సిఎం రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐతే, ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరలో అమలు చేస్తేనే సత్ఫలితం ఉంటుందన్నది సుస్పష్టమైంది.

