వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలి
ప్రతిరోజూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
పాలకుర్తి లోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దవాఖానలో అందించే సేవలు, సదుపాయాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ దవాఖానలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, నిరుపేదలకు సక్రమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, వైద్యులు, నర్సులు, సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓపీ సేవలను పెంచాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రోగులకు టెస్టులు సక్రమంగా నిర్వహించి, చికిత్సలు మరియు ఔషధాలు సమయానికి అందించాలని అన్నారు.
దవాఖానలో ఉన్న పరికరాలు, ఔషధ నిల్వలు, ఇతర వసతులను పరిశీలించిన కలెక్టర్, రోగుల నుంచి అందుతున్న సేవలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారాన్ని తినడం, మందులు సరిగ్గా వేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని రోగులకు సూచించారు. ఈ తనిఖీలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు వున్నారు.

