గ్రామీణ స్థాయిలో కనుమరుగవుతున్న క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరం
పాలకుర్తిలో గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన తొర్రూర్ AMC చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి
పాలకుర్తి మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం సందర్భంగా ZPHS పాఠశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ క్రీడోత్సవాలను ముఖ్య అతిథిగా హాజరై తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమాండ్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు అతి త్వరలో ప్రభుత్వం తరఫున పాలకుర్తిలో మినీ స్టేడియం నిర్మించడానికి నిధులు కావాలని సిఎం రేవంత్ రెడ్డి ను అడిగారని తెలిపారు. అతి త్వరలో మంజూరు కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో కనుమరుగవుతున్న క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, యువ చైతన్య యూత్ ఈ పోటీలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత తగ్గిపోతున్న నేపథ్యంలో ఇలాంటి పోటీల ద్వారా యువతకు ప్రోత్సాహం అందించడమే కాకుండా, వారి ప్రతిభను వెలికితీయడం ఎంతో సముచితం అన్నారు. క్రీడలు యువత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, శారీరక ఆరోగ్యం కోసం కూడా కీలకమని ఆయన గుర్తు చేశారు.ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, వారికి సమాజంలో గుర్తింపు తీసుకొస్తాయన్నారు.

ఈ కబడ్డీ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహాత్మా హెల్పింగ్ హండ్స్ గంట రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, ఎస్.ఐ లింగారెడ్డి, మండల విద్యాధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

