భువనగిరి బీఆర్‌ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ దాడి ఘటనలో ప్రమేయం వుండటంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో, పోలీసులు ముందస్తు చర్యలకు పూనుకున్నారు. కీలక నాయకుల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంఎల్ఏలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ ఇంఛార్జ్ క్యామ మల్లేశ్ తదితరులను హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ ఇళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు తెల్లవారుజాము నుండి జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. అరెస్టులు, హౌస్ అరెస్టులు, దాడుల నేపథ్యంలో పార్టీల మధ్య సంబంధాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తుందో చూడాలి.


