-ఓ యూ ట్యూబర్ అరెస్టు పై పాలకుర్తిలో బి ఆర్ ఎస్ నిరసన
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పాలకుర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరాలని ప్రజల తరఫున ప్రశ్నిస్తే కేసులు! అరెస్టులు! వేధింపులా? అంటూ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిరసన, ఆందోళన జరిగింది. అశ్లీల పద ప్రయోగాలతో ప్రభుత్వం పై, సీఎం పై, ఎమ్మెల్యే పై దూషణలు చేస్తున్నారన్న ఆరోపణలతో కూడిన ఫిర్యాదుపై ఓ యూట్యూబర్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ప్రభుత్వానికి, సీఎం కి, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆ యూట్యూబర్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి, మరికొందరు నాయకులు మాట్లాడుతూ, అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో హామీలు నెరవేర్చకుండా ప్రజలను వహించడమే కాకుండా వాళ్ళని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని, పాలకుర్తి నియోజకవర్గం లో ఇప్పటికే ఇద్దరు యూట్యూబర్లని అరెస్టు చేశారని అన్నారు. ప్రజాస్వామిక రాష్ట్రంలో ప్రశ్నించడమే పెద్ద ప్రమాదమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని వేధించడం కాకుండా ముందు అభివృద్ధి పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పాలకుర్తి నియోజకవర్గం వివిధ మండలాల గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

