పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లో సుడిగాలి పర్యటన చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల దర్శనం, సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాల ప్రారంభోత్సవం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం కోసం సమీక్ష సమావేశం తదితర కార్యక్రమాలతో వారు బిజీబిజీగా గడిపారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజలు


ముక్కోటి ఏకాదశి సందర్భంగా పాలకుర్తి మండలం వాల్మీకి మహర్షి నడియాడిన నేల అయిన వల్మీడి గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తొర్రూరు పట్టణంలోని పాటిమిది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని, ఆ తరువాత రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు


రాయపర్తి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ క్రీడా ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక శక్తిని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, సామూహిక సమన్వయం వంటి విలువలు నేర్చుకోవచ్చని తెలియజేశారు. క్రీడా ఉత్సవాలు యువత ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే వేదికలుగా నిలుస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కష్టపడ్డ వారికే గుర్తింపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ విజయానికి కృషి చేయాలి
మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి


పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, తొర్రూరు మండల నాయకులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం కోసం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినీ రాజా రామ్మోహన్ రెడ్డి, ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు చురుకుగా పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని, మన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

