నేడు హైకోర్టు విచారణ
మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కోర్టు పంజాగుట్ట పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేయడంతో పాటు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే పోలీసులు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, సాక్షులను రికార్డ్ చేసి హైకోర్టులో తమ కౌంటర్ దాఖలు చేశారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసులు తమ వాదనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది. మరోవైపు, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటుండగా, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేస్తుందా లేక కేసు కొనసాగించమని ఆదేశిస్తుందా అనే ఉత్కంఠకు ఈ రోజు ముగింపు పలకనుంది.

