మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ఏసీబీ కేసు విషయమై మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది, కోర్టులు తప్పు-ఒప్పులను తేల్చుతాయి. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు” అంటూ కోర్టు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. “మాకు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదు, మేము ఎవరినీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం లేదు” అని తెలిపారు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందిస్తూ, “కేటీఆర్ మారలేదు, ఆయన రైటర్ మారినట్లుంది. కొత్త సంవత్సరంలో కేటీఆర్‌లో స్పిరిట్ పెరిగింది” అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఇచ్చిన విషయమై బీఆర్ఎస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, బాండ్స్ మాత్రమే కాదు, విదేశీ కంపెనీలకు వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్లాయో తేలాలని పేర్కొన్నారు. “ప్రాంతీయ పార్టీల్లో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్. అంత డబ్బు ఎలా వచ్చింది?” అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ రావు అక్కడే ఉంటారని వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశం లేదు. కానీ ఏదైనా బయటపడితే ఆ కుటుంబ పాత్ర ఉంటోంది” అన్నారు.
ఇప్పటి వరకు దాఖలైన కేసులు, విచారణలు బీఆర్ఎస్ నేతలే అడిగినవేనని, కక్షపూరితంగా చేసినది లేదని అన్నారు. భూదాన్, దేవాదాయ భూముల్లో జరిగిన కుంభకోణాలపై, సిరిసిల్లలో 2,000 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలను నియమించనున్నట్లు వెల్లడించారు. “సియోల్ బాంబులు పేలడం మొదలైంది, విద్యుత్ కమిషన్ రిపోర్టు ఇప్పటికే వచ్చింది, ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటోంది” అంటూ వ్యాఖ్యానించారు.

