ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్
కేటీఆర్ నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు
బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అరెస్టు, కేటీఆర్‌పై ఉన్న కేసులు మధ్య పోలికలు లేవని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టల కేసులో కెమెరాల ముందే దొరికిపోయి జైలుకెళ్లాడని, దీనికి కేటీఆర్ కేసు ఏ మాత్రం పొంతనలేదన్నారు. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌కు తెచ్చారని, ఇది రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిందని హరీష్ రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమంలో విఫలమై, ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఈ వ్యతిరేకతను మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై కేసులు పెట్టి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పు కేవలం విచారణకు ఆదేశించిందని, అవినీతి నిర్ధారణకు సంబంధం లేదని హరీష్ రావు వివరించారు. కేటీఆర్ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, గతంలో కూడా ఏసీబీకి వెళ్లి సహకరించారని గుర్తు చేశారు.
ఫార్ములా ఈ రేస్‌ను అనేక రాష్ట్రాలు తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, కేటీఆర్ దూరదృష్టితో హైదరాబాద్‌కు తీసుకొచ్చారని హరీష్ అన్నారు. ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసులు, ఆరోపణలు, అరెస్టులకు భయపడమని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

