తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం ఉదయం వర్చువల్ ద్వారా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్య ప్రసంగం చేశారు. ఈ టెర్మినల్ ప్రజలకు పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. టెర్మినల్ ప్రారంభం సందర్భంగా, బందర్ పోర్టుకు రైల్వే లైన్ అనుమతి, తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహన తయారీకి అనుమతులు కోరారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు, రైల్వే రింగ్ స్థాపన వంటి అంశాలను ప్రస్తావించి, అభివృద్ధి కోసం వీటిని అనుమతించాలని కోరారు.
ఈ ప్రాజెక్టు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించి, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఒక ముఖ్యమైన స్టేషన్ అవుతుంది. ఆరున్నరేళ్లలో ₹428 కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్ శివారు ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది. జనవరి 7 నుండి కొత్త రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

