తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన హక్కులను కాలరాస్తోందని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏసీబీ నోటీసులకు సమాధానం చెప్పడానికి సాధారణ పౌరుడిగా కార్యాలయానికి వచ్చానని, కానీ పోలీసులు తనను లోపలికి అనుమతించడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు.
తనపై అక్రమ ఆరోపణలు చేస్తూ దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసి, స్టేట్మెంట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తనపై కూడా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయన్నారు.
రైతు భరోసా కోత విధించి రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తన వెంట న్యాయవాదులను అనుమతించకపోవడం దారుణమని, ఇది తన ప్రాథమిక హక్కులపై చేయి వేయడమేనని చెప్పారు. తనపై ఎన్ని దాడులు జరిగినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కోసం పోరాటం ఆపదని కేటీఆర్ స్పష్టంచేశారు.

