డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో డిసెంబరు 31వ తేదీన నిర్వహించిన రేవ్ పార్టీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి 13 మందిని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు వైకాపా నాయకుడు కొమ్ము రాంబాబు, ఆయన మున్సిపల్ ఛైర్పర్సను సమీప బంధువు. మండపేటలోని లేఅవుట్లో జరిగిన ఈ పార్టీలో ట్రాన్స్ జెండర్లు, డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెల్ఫోన్ వీడియోల ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.

