సిడ్నీ టెస్టులో (AUS vs IND) భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగు బౌండరీలు బాదిన జైస్వాల్, టెస్టుల్లో మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు రాబట్టడం గమనార్హం. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన యశస్వి (22)ను స్కాట్ బోలాండ్ బౌల్డ్ చేశాడు. దీంతో టెస్టు సిరీస్‌లో యశస్వి ఆట ముగిసినట్లైంది. ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్, తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. సునీల్ గావస్కర్ (450), సెహ్వాగ్ (464), మురళీ విజయ్ (482) తర్వాత ఈ ఘనత సాధించాడు.

