సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని స్పష్టం చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదా దర్యాప్తు జరపడం కోసం ఇకపై సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉండదని పేర్కొంది.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్, మేఘాలయ, రాజస్థాన్, జార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర అనుమతి అవసరం అనే నిబంధన అమలులో ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడం పై సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, రాష్ట్ర అనుమతి ఆవశ్యకత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

