రైతు భరోసా పథకం అమలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని సమావేశంలో మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. రైతులకు భరోసా అందజేయడానికి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని, జనవరి 5 నుంచి 7 వరకు అప్లికేషన్లు స్వీకరించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.
రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంత మేర భూమికి ఇవ్వాలి, నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 14న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయాలతో పథకం అమలుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుంది.

