ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన, జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోవడమే కాకుండా, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుకూల సంబంధాలు ఉండడంతో రామాయణపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. నర్సాపురం-మచిలీపట్నం రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధమైందని, ఈ బడ్జెట్‌లో నిధులు విడుదల కావచ్చని చెప్పారు. నర్సాపురం-కోటిపల్లి రైల్వే లైన్ పనులు భూసేకరణ సమస్యల కారణంగా జాప్యం చెందాయని తెలిపారు.
నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని, వీటి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

