హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి పాల్పడిన ఇద్దరికి న్యాయమూర్తి విచిత్ర శిక్ష విధించారు. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన వ్యాపారి దయా సాయిరాజ్(28) తన స్నేహితురాలు(25)తో కలిసి డిసెంబరు 28న ఓ విందులో పాల్గొని వెళ్తూ, జూబ్లీహిల్స్ రోడ్డు నం.1 వద్ద వాహనాన్ని అదుపు తప్పించి డివైడర్‌ను ఢీకొట్టాడు. వాహనం రహదారి అవతలి వైపుకు దూసుకెళ్లి ఫుట్పాత్‌పై ఆగిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఠాణాకు తరలించి శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించారు.
వారిని డిసెంబరు 29న నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చగా, న్యాయమూర్తి వారిని బెయిలుపై విడుదల చేయడమేగాక, 15 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ కేంద్రంలో కూర్చొని అక్కడికి వచ్చే వారందరికీ స్వాగతం పలకాలన్న శిక్ష విధించారు. నిందితులు ఇప్పటికే కోర్టు ఆదేశాలను పాటిస్తూ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు పెడుతున్నారు. ఈ చర్యలు రహదారి భద్రతలో ప్రజలకు అవగాహన కలిగించడానికేనని పోలీసులు తెలిపారు.

