జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి విషయమై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన, రాజకీయాల్లో పని తీరే ప్రధాన ప్రమాణమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించడం తన బాధ్యత అని అన్నారు. “నాగబాబు నా తొడబుట్టు. పార్టీ కోసం ఆయన అనేక త్యాగాలు చేశారు. వైసీపీ నేతల విమర్శలు ఎదుర్కొన్నా, జనసేన బలోపేతానికి నిలబడ్డారు. కులం, బంధుత్వం కాకుండా, పనితీరును ఆధారంగా చేసుకుని ఆయా పదవులను ఇవ్వడం మా విధానం,” అని పవన్ చెప్పారు.
తమ కుటుంబానికి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, అన్నయ్య చిరంజీవి స్వతహాగా ఎదిగారని, ఇప్పుడు తమ తర్వాత తరానికి ఒక బలమైన నేపథ్యం ఉందని పవన్ పేర్కొన్నారు. “నాగబాబును ఎంపీగా ప్రకటించాం కానీ అనివార్య పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్నాం. ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రి పదవి విషయమై తర్వాత చర్చిస్తాం. కందుల దుర్గేష్ వంటి వారికి కులం చూడకుండా, పనితీరు నచ్చి పదవులు ఇచ్చాం,” అని తెలిపారు.
సమగ్ర రాజకీయ విధానంలో కులం ప్రాధాన్యత కాదు, కృషి, నిబద్ధత ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

