అజర్బైజాన్ ఎయిర్లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కజఖస్తాన్‌లో కుప్పకూలిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు, 29 మందికి గాయాలయ్యాయి. ఈ నెల 25న బాకు నుంచి గ్రోజ్నికి బయలుదేరిన విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ప్రమాదానికి రష్యా కాల్పులే కారణమని అలియెవ్ పేర్కొన్నారు. “రష్యా ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదనుకుంటున్నాను. కానీ, ప్రమాదానికి దారితీసిన కారణాలను దాచిపెట్టేందుకు మాస్కో ప్రయత్నించింది. మొదటి మూడు రోజులు తప్పుడు వాదనలు వినిపించటం బాధాకరం” అని ఆయన పేర్కొన్నారు.
అలియెవ్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. కానీ, విమానాన్ని రష్యానే కూల్చిందని అంగీకరించలేదు. ఈ క్రమంలో అలియెవ్ రష్యాపై విమర్శలు గుప్పించారు. నిజాన్ని అంగీకరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అజర్బైజాన్ అధికారిక మీడియా ప్రకారం, రష్యా వైఖరి బాధాకరమని, ప్రమాదానికి సంబంధించిన నిజాలు వెల్లడించకుండా కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. పుతిన్ మరోసారి అలియెవ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు క్రెమ్లిన్ తెలిపింది. అయితే, రష్యా వైఖరి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

