మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. 1991లో ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయన ఆర్థిక మంత్రి హోదాలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి సంస్కరణలను అమలు చేసి, దేశాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి దిశగా నడిపించారు. సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేసి, యువతకు ఉపాధి అవకాశాలను పెంచారు. ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్, వ్యవసాయ, పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన ఘనత ఆయనకు చెందుతుంది.

