హైదరాబాద్, డిసెంబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి)
నిజాం పాలనలో ఆవిర్భవించిన అజం జాహి మిల్లు పేరు చెప్పుకొని వరంగల్ రాజకీయ రంగంలో ఎదిగిన పలువురు ప్రజా ప్రతినిధులు.. ముఖ్య నేతలు ఇప్పుడు మౌనముద్ర దాల్చారు. అజం జాహి కార్మిక భవనం నేలమట్టమైనా పెదవులు వివ్వడం లేదు. రాజకీయాల్లో ఎదిగేందుకు అజం జాహి అంశాన్ని వాడుకొని తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ తూర్పు నుంచి ముఖ్య నేతలుగా ఉన్నవారు కార్మిక భవనాన్ని అమ్మడానికి సహకరిస్తే, ప్రస్తుత పాలకులు ఏకంగా భవనం నేలమట్టం కావడానికి కారణమయ్యారు. ఇదంతా చూస్తున్న ఓరుగల్లు ప్రజలు పదవులు పొందిన నాయకుల్లారా..! పెదవులు ఎందుకు విప్పడం లేదని? ప్రశ్నిస్తున్నారు.

బండ ప్రకాష్, తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్ :
అజంజాహి మిల్లు పేటెంట్ హక్కులన్నీ తనవేనంటూ… కార్మిక సంఘాలన్నీ తన వెంటే ఉన్నాయంటూ… ఈ పెద్దాయన అటు కాంగ్రెస్ లో, ఇటు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాల లో కీలక పదవులు పొందారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా, ప్రస్తుతం శాసనమండలి వైస్ చైర్మన్ గా పదవులు నిర్వహిస్తూ కార్మిక భవనం కూల్చివేత పై కనీసం స్పందించడం లేదు. గతంలో కార్మిక భవన నిర్మాణానికి రూ.20 లక్షలు సైతం మంజూరు చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తనకేం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.

కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే:
తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు ప్రారంభించి, పలు సామాజిక పోరాటాల్లో పాల్గొని ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవులు పొందిన పెద్ద సారు. అజం జాహి మిల్లు కార్మిక భవనం కూల్చివేతపై ఇప్పటివరకు ఏమాత్రం స్పందించలేదు.

వరంగల్ మేయర్ గుండు సుధారాణి:
అజం జాహి మిల్లు కార్మికులలో 90 శాతం మంది పద్మశాలి సామాజిక వర్గమే. అదే సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గుండు సుధారాణి గతంలో జరిగిన అజం జాహి కార్మిక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. రాజ్యసభతో పాటు పలు కీలక పదవులు పొందారు. ప్రస్తుతం వరంగల్ నగర మేయర్. తన హయాంలోనే కార్మికం భవనం నామరూపాలు లేకుండా పోయినా, ఆమె కనీసం తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ:
వరంగల్ తూర్పు రాజకీయాల్లో అర్థ శతాబ్దపు అనుభవం ఉన్న నాయకుడిగా సారయ్యకు పేరుంది. కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి… రాష్ట్ర మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అజం జాహి కార్మిక భవనం కూలిస్తే అది తనకు సంబంధం లేని విషయంగా, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.

బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ, భారత రాష్ట్ర సమితి కీలక నేత:
తెలంగాణ ఉద్యమంలో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడిగా, మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న వినోద్ కుమార్… వామపక్ష ఉద్యమాల నుంచి రాజకీయల్లోకి వచ్చారు. సిపిఐ లో పనిచేసినప్పుడు అజం జాహి కార్మిక పోరాటాలలోనూ పాలు పంచుకున్నారు. హనుమకొండ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, నేనున్నానంటూ స్పందించే వినోద్ కుమార్, కార్మిక భవనాన్ని కూల్చి వేసినా కనీసం మాట్లాడడం లేదు.

కొండా సురేఖ, రాష్ట్ర మంత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొండా సురేఖ, కార్మిక భవనం కూలి పక్షం రోజులు గడిచినా ఇప్పటివరకు స్పందించలేదు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా నరేందర్ ఉన్నప్పుడు కార్మిక భవనాన్ని కాపాడాలంటూ సురేఖ కాంగ్రెస్ కార్యకర్తలతో కలెక్టర్, కమిషన్ అధికారులకు వినతి పత్రాలు ఇప్పించారు. మంత్రి సురేఖ భర్త కొండా మురళీధర్ రావు ఏకంగా కార్మిక భవనం ఉద్యమాలకు సైతం సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా, కీలక మంత్రిగా ఉన్న సురేఖ మాత్రం కార్మిక భవనం గురించి పల్లెత్తు మాట్లాడడం లేదు.
అజం జాహి మిల్లు చరిత్ర
1934లో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అజం జాహీ మిల్స్ ప్రారంభమైంది.
ఈ మిల్లుకు కు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ అజామ్ జాహ్ పేరు పెట్టారు.
200 ఎకరాలకు పైగా భూములతో ఏర్పాటైన ఈ మిల్లు దేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమలలో ఒకటి.
స్వాతంత్య్రానికి ముందు, ఈ మిల్లు 10,000 మందికి పైగా ఉపాధిని కల్పించింది.
ఈ మిల్లు సైరన్ వరంగల్, చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు ఉదయం వేక్-అప్ కాల్‌గా వచ్చేది.
1974లో బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఈ కంపెనీని స్వాధీనం చేసుకుంది.
1980 చివరి వరకు ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఈ మిల్లును, 1990ల ప్రారంభంలో మూసివేశారు.
2008లో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా)కి ఈ భూమి ఇవ్వగా, దాన్ని ప్లాట్లుగా తయారుచేసి విక్రయించారు.
మిల్లులో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున స్థలాలు కేటాయించబడ్డాయి.
ఆజం జాహి మిల్లుకు చెందిన 200 ఎకరాలలో ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది.

