కర్ణాటకలోని విజయనగర శ్రీ కృష్ణ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్గా తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ నియామకం జరిగింది. కన్నడలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రేణుకా పూజార్ అనే ట్రాన్స్ జెండర్, గెస్ట్ లెక్చరర్‌గా జాయిన్ అయ్యారని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ పోస్టు కోసం 30 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పూజార్కు అవసరమైన విద్యార్హతలు, మంచి మార్కులు, డెమో క్లాసులో ఉత్తమ ప్రదర్శన చూసి ఎంపిక కమిటీ ఆమెను సెలక్ట్ చేసింది. దీంతో, రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌గా ఎంపికైన తొలి ట్రాన్స్ జెండర్‌గా రేణుకా పూజార్ నిలిచారు.
ఈ సందర్భంగా పూజార్ మాట్లాడుతూ, “గెస్ట్ లెక్చరర్‌గా ఎంపిక కావడం ఎంతో సంతోషకరమైనది. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. 2017లో ట్రాన్స్ జెండర్‌గా మారాను. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ఇతర ట్రాన్స్ జెండర్లను కూడా ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటాను” అని తెలిపారు. బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన రేణుకా పూజార్, తన ప్రొఫెసర్ అవ్వాలని, పీహెచ్డీ చేయాలని ఆశపడుతున్నారు.

