దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న కియా, తాజాగా విక్రయాల్లో రికార్డు సృష్టించింది. కియా తన కంపాక్ట్ ఎసయూవీ సోనెట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించిన 11 నెలల్లోనే 1,03,353 యూనిట్లను విక్రయించింది. ప్రతి నెల సగటున 10,000 యూనిట్ల కార్లను సేల్ చేసినట్లు కంపెనీ శనివారం వెల్లడించింది. మొత్తం సోనెట్ విక్రయాల్లో 76 శాతం పెట్రోల్ వేరియంట్లు, 24 శాతం డీజిల్ వేరియంట్లను విక్రయించారు. ఈ ఏడాది జనవరి 12న అప్డేటెడ్ సోనెట్ మోడల్‌ను కియా లాంచ్ చేసింది. మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ. 7,99,000గా ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 15,69,000గా నిర్ణయించారు. టాటా నెక్కాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్, స్కోడా కైలాక్ వంటి ఇతర ప్రముఖ ఎసయూవీలకు పోటీగా కియా సోనెట్‌ను విడుదల చేశారు. భారత మార్కెట్లో సోనెట్‌కు ఉన్న డిమాండ్ కియా విజయాన్ని మరింత ఉజ్వలంగా నిలిపింది.

