బియ్యం మిస్సింగ్ స్కాం ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారు. శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, టీడీపీ సోషల్ మీడియా సెల్ తప్పుడు రాతలతో తమను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
తమ గోడౌన్‌లో బియ్యం మైనస్‌గా ఉండడంపై అధికారుల ప్రకటనలతో తన భార్య నైతిక బాధ్యత వహిస్తూ లేఖ రాసిందని తెలిపారు. 3,800 బస్తాల తగ్గుదల వల్ల రూ. 8 లక్షలు చెల్లించినప్పటికీ, అధికారులు కేసులు నమోదు చేశారని నాని చెప్పారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కుట్రలు చేసి, తన భార్య మీద అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.
తన భార్యపై యూట్యూబ్‌లో వ్యక్తిగత వ్యాఖ్యలతో బురద చల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పుడు పని చేయలేదని తల్లిపై ప్రమాణం చేశానని నాని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తనను, తన కుమారుడిని టార్గెట్ చేశారని, గోడౌన్ మేనేజర్ అరెస్టుకు కుట్రలు జరిగాయని తెలిపారు. అధికార పార్టీ ఇంటి మహిళల వరకు దాడి చేయడం బాధాకరమని, త్వరలో వాస్తవాలు బయటపడతాయని నాని స్పష్టం చేశారు.

