చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అస్తవ్యస్తంగా మారిందని, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం, ఇన్సులిన్ వంటి ముఖ్యమైన మందుల లభ్యత లేకపోవడం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది కలుగుతున్నాయి అని అన్నారు.
అలాగే, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పారు. ఉద్యోగులను అన్యాయంగా తొలగించడం, ఇతరులకు ఒత్తిడులు పెంచడం వంటి చర్యలు ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనమని, ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలను ‘సూపర్ సిక్స్’ కాకుండా ‘సూపర్ షాక్’ గా అభివర్ణించిన కన్నబాబు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వం స్వార్థపూరిత లక్ష్యాలను మాత్రమే చేరుకోడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
చంద్రబాబు తన సొంత మీడియా సహాయంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండటాన్ని కన్నబాబు తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య, ఆర్థిక భద్రత వంటి కీలక అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పాలనపైనే నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోందని అభిప్రాయపడ్డారు. జన సంక్షేమానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం తక్షణం బాధ్యతగల చర్యలు తీసుకోవాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు.

