వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా భారత్ నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో స్విస్ స్కై రిసార్ట్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఏపీ మంత్రి నారా లోకేశ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది సదస్సుకు ‘కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ అనే ప్రధాన థీమ్‌ను ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. భారత్ నుంచి బిజినెస్ రంగంలో ప్రముఖమైన అదానీ, రిలయన్స్, టాటా, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రెజ్, జిందాల్, బజాజ్, వేదాంత గ్రూపులు వంటి పెద్ద కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివులు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సదస్సు పలు సెషన్లలో ‘ఇండియాస్ ఎకనమిక్ బ్లూప్రింట్’ వంటి అంశాలపై భారత ప్రతినిధులు ప్రసగించనున్నారు. అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, సాంకేతికత, వాణిజ్య విధానాలు, పర్యావరణం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలను చర్చించేందుకు ఈ సదస్సు మంచి వేదికగా మారబోతోంది.

