సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…..థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు రావడానికి ఒకే మార్గం ఉండటంతో, సెలెబ్రిటీ వస్తే అనవసర గందరగోళం తలెత్తుతుందని పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించినట్లు సీఎం తెలిపారు.
అయితే, అనుమతి లేకున్నా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. హీరో కేవలం థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూస్తూ వెళ్తే ఎలాంటి సమస్య ఉండేది కాదని, కానీ రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో నిర్వహించడం వల్ల పరిస్థితి విషమించిందని సీఎం సభకు వివరించారు.
హీరో అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్‌కి వెళ్తుండగా, పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ప్రేక్షకులు సంధ్య థియేటర్ వైపుకు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ గందరగోళంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కొల్పోయారన్నారు. ఆ సమయంలో కూడా ఆమె తన కొడుకును గట్టిగా పట్టుకుని ఉండటం తల్లి ప్రేమను ఎలాంటిదో తెలుస్తుందని సీఎం అన్నారు. కానీ ఈ ఘటనలో ఆమె కొడుకు శ్రీ తేజ్ గాయపడి కోమాలోకి వెళ్లాడు.
ఈ పరిస్థితుల్లో కూడా హీరో అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించలేదని సీఎం మండిపడ్డారు. ఘటన జరిగిందని, శాంతి భద్రతలు క్రమం తప్పే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ముందే హెచ్చరించినా, హీరో అల్లు అర్జున్ అటువంటి మాటలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
సహకరించకపోవడంతో డీసీపీ స్వయంగా అక్కడికి వెళ్లి, అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో హీరో అల్లు అర్జున్ కారు ఎక్కినప్పటికీ తిరిగి రోడ్ షో చేస్తూ వెళ్లడం దురదృష్టకరమని సీఎం తెలిపారు. ఈ ఘటనపై హీరో, థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హీరో అల్లు అర్జున్ అని అన్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబాన్ని సినిమా ప్రముఖులు కూడా పరామర్శించకపోవడం విచారకరమని సీఎం అన్నారు.
ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించేవారు, చావుకు కారణమైన వారిని ప్రశ్నించకుండా ప్రభుత్వంపై మాటలతో దాడి చేయడాన్ని సీఎం తప్పుబట్టారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అనుమతులు ఇస్తున్నా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రభుత్వం సహకరించదని సీఎం స్పష్టం చేశారు.
సినీ ఇండస్ట్రీ తన బాధ్యతను గుర్తించి వ్యవహరించాలన్నారు. వ్యాపారం చేసుకోవడం సమంజసమే కానీ, ప్రాణాలు బలిగొట్టే విధంగా వ్యవహరించడం సహించరాదని హెచ్చరించారు. “మా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే నడుచుకుంటుంది. ప్రజల ప్రాణాలతో ఆడే ఆటలను మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించము. బాధ్యులు ఎవరు అయినా సరే, వారిని ప్రశ్నించడంలో వెనుకాడము,” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

