మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…..
పార్లమెంట్ పరిధిలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, “పార్లమెంట్ లోకి వెళ్లనివ్వకుండా మకర ద్వారం వద్ద బీజేపీ ఎంపీలు మాపై దాడి చేశారు. మమ్మల్ని తోసేయడంతో అదుపు తప్పి కూర్చుండిపోయాను. నా కాలికి గాయమైంది. ఇది ప్రజాస్వామ్యానికి అపచారం,” అని అన్నారు.
అలాగే “ప్రజా సమస్యల కోసం పోరాడే మాకు ఇలాంటి అడ్డంకులు రావడం దురదృష్టకరం. పార్లమెంట్‌లో మమ్మల్ని అడ్డుకోవడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. బీజేపీ అప్రజాస్వామిక చర్యలు ప్రజల ముందుకు తీసుకెళ్లి, వారి అసలైన ధోరణిని వెలుగులోకి తీసుకొస్తాం” అని చెప్పారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ…..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ…., “అదాని గ్రూప్ అవినీతిపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. మకర ద్వారంలో బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకోవడం కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే,” అని అన్నారు.
అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలను రాజ్యాంగ వ్యతిరేకమంటూ విమర్శించారు. “బీజేపీ రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆయనను అవమానించినందుకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేశారు.
ఆదానీ అవినీతి అంశంపై “దేశాన్ని ప్రధాని మోడీ అదానీకి అమ్మేస్తున్నారు. ఇది ప్రధానమైన సమస్య. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకూడదని బీజేపీ కోరుకుంటోంది. ప్రజలు ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.
విపక్షాల ఆందోళన
కాంగ్రెస్ నేతల విమర్శలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి. పార్లమెంట్ పరిధిలో దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ప్రకటించారు.
రాజకీయ ఉద్రిక్తతలు
ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచింది. బీజేపీ ఎంపీల చర్యలపై నెటిజన్లు, సామాజిక ఉద్యమకారులు కూడా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మొత్తానికి, ఈ పరిణామం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై చర్చను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.

