ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని, శాసనసభ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, బిఆర్ఎస్ శాసనసభ పక్షం సభ హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్‌కు సమర్పించింది. ఈ సందర్భంగా ఇచ్చిన నోటీసులో శాసనసభా హక్కులను కాపాడాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. అలాగే 2024 డిసెంబర్ 19న పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడం ద్వారా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించారని తెలిపారు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 245 ప్రకారం ప్రభుత్వ చర్యలు సభ హక్కులకు హాని కలిగించాయని ప్రతిపక్ష BRS పార్టీ ఆరోపించింది. చట్ట ప్రకటనల ద్వారా ప్రభుత్వ తీరుతో శాసనసభ గౌరవానికి భంగం కలిగిందని, చర్చ దశలో ఉన్న బిల్లును ముందస్తుగా చట్టంగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

