యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం పహిల్వాన్‌పురం సర్పంచ్ అభ్యర్థి పచిమట్ల రేణుక మల్లేష్ గ్రామ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా రూపొందించిన 12 ప్రత్యేక హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను గ్రామ సోషల్ మీడియా గ్రూప్‌లో విడుదల చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై ప్రతివారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజల అభిప్రాయాలతోనే గ్రామ పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ప్రతి వార్డుకు అభివృద్ధి కమిటీల ఏర్పాటు, గ్రామంలో శాంతి భద్రతల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తామని చెప్పారు. వీధివీధినా విద్యుత్ దీపాల ఏర్పాటు, కోసి టీవీలు, డిజిటల్ కనెక్షన్లు కల్పించడం, ప్రతి వార్డుకు రోడ్ల నిర్మాణం, గ్రామ చెరువును మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయడం తమ ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు చేరేలా కృషి చేయడమే కాకుండా, ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఇళ్లు మంజూరు చేయించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. పదవీకాలంలో తప్పులు జరిగినట్లు రుజువైతే ప్రజలు విధించే శిక్షకూ సిద్ధమని రేణుక మల్లేష్ ప్రకటించారు.

