గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ మోహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంతో రాష్ట్ర కేబినెట్ మరింత బలోపేతం కానుంది.
ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఓసీ వర్గానికి, మరొకటి బీసీ వర్గానికి కేటాయించే అవకాశముందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆయన ఎమ్మెల్సీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖల్లో ఏదో ఒకటి ఆయనకు దక్కే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. క్రీడల రంగంలో అజారుద్దీన్ అనుభవం, మైనార్టీ వర్గాల్లో ఆయనకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

