ERSTWHILE|ఉమ్మడి MAHABUBNAGAR|పాలమూరులో HEAT|వేడెక్కిన రాజకీయం|POLITICS
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 27 (అడుగు న్యూస్):
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేయడంతో పాలమూరు జిల్లాల్లో రాజకీయ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంకేతాలు ఇచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చెలాయించి, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్తులను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కీలక మంత్రులుగా వున్న నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ ఐదు జిల్లాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి. అయితే, 2023 చివర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలమూరులో తన సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతోంది.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలను బీసీలకు కేటాయించగా, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ ఎస్సీకి, నారాయణపేట జిల్లా పరిషత్ ఓసీకి కేటాయించింది. ఈ మార్పుతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొనగా, స్థానికంగా రాజకీయ ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు అనుకూలంగా జిల్లా పరిషత్ టికెట్లు దక్కించుకోవడానికి పై నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఐదు జిల్లా పరిషత్తులలో కనీసం మూడు దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో బీసీలకు కేటాయించడంతో అక్కడ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే గద్వాల, నారాయణపేటలో మాత్రం పోటీ గట్టిగానే ఉంటుందని అంచనా.
ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో స్థానిక నాయకులు, ఆశావహులు తమ తమ క్యాడర్ ను సమీకరించుకోవడంలో బిజీగా ఉన్నారు. జిల్లా స్థాయి నాయకత్వం ఎంపీటీసీలు, జడ్పిటీసీలు, జిల్లా పరిషత్తులతో పాటు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కిందిస్థాయి క్యాడర్ పై దృష్టి పెట్టింది. గ్రామ స్థాయిలోని క్యాడర్ తమ నాయకుల చుట్టూ తిరుగుతూ రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కసరత్తులు చేస్తున్నారు.
అదే సమయంలో, బీసీ రిజర్వేషన్లలో 50 శాతం స్థానాలు మహిళలకు కేటాయించనున్న నేపథ్యంలో మహిళా ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గ్రామ, మండల స్థాయిల్లో చురుకుగా ఉన్న మహిళా కార్యకర్తలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇది బీసీ వర్గాల నుంచి కొత్త నాయకత్వాన్ని వెలికితీయడానికి దోహదపడనుంది.
ఈ పరిణామాలను పరిశీలిస్తూ రాజకీయ వర్గాలు, విశ్లేషకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి బలమైన బీసీ ఓటు బ్యాంకును సమకూర్చుకునే వ్యూహాత్మక అడుగు వేశారని. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బహిరంగ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను ఇప్పుడు అమలులోకి తేవడం చారిత్రాత్మకమని, ఇది రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ అవుతుందని చెబుతున్నారు.
ఏదేమైనా, ఈ రిజర్వేషన్ల ఖరారుతో పాలమూరు రాజకీయం వేడెక్కింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిల్లా పరిషత్తులను తన ఖాతాలో వేసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

