
కుక్క బత్కు. కుక్క సావు. కుక్క పీకులాట, అసొంటి తిట్లే కాదుల్లా, బతికితే కుక్కలా బతకాలి. ఊల్ల పెల్లికి కుక్కల హడావుడి యెక్కువ. కుక్క యిశ్వాసం గల్ల జంతువు. ఊరికి కాపలగా దర్జాగా ఉంటయి గన్క, గ్రామ సింహం అని గూడా కుక్కలను పిలుస్తరు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ…అన్నరు. ఇట్ల కుక్క మీద లెక్కలేనన్ని సామెతలు ఒచ్చినయి.
ఈధి కుక్కల సంగతి పక్కన పెడితే, పెంపుడు జంతువులుగ గూడ కుక్కలకు మించిన నమ్మకైన జంతువే గీ బూమ్మీద లేదు. జగముల పుట్ట లే. గందుకే శాలా మంది కుక్కలను మనుసుల కంటే ఎక్కవగ పేమిస్తరు. కక్కలను పావురంగ, తమకు పుట్టిన బిడ్డల కంటే గూడ ఎక్కవగ పేమగా పెంచుకుంటున్నరు.
కుక్క మనిషిని కరిస్తే కాదు, మనిషే కుక్కను కరిస్తేనే వార్త అని గూడ అన్నరు. ఎందుకంటె కరవడం దాని లచ్చనం. గందుకే గద కనకపు సింహాసనం మీద శునకమును కూర్చండబెట్టిన యెనుకటి గుణమేల బోతదన్నరు. యే దిదంత ఎందుగ్గనీ, కుక్క కుక్కే. మనిషి మినిషే.
కుక్కకు మనిషికి గంత దగ్గరి సంబందం ఉన్నది గాబట్టే గీ గిన్ని ముచ్చట్లొచ్చినయి. యే ఇగ గిదంత గా కుక్కల గురించెందుకని గద మీ అనుమానం. యిమానంగ శెప్తాన.. గిది మీరు సదివి తీరాల్సిందే.
మన దేశంల ఉత్తర పదేశ్ రాస్ట్రం ఉంది గద. గాడ కుక్క రోండోసారి కరిసిందనుకోండ్లి. ఇగ కుక్కకు గూడ జీవిత ఖైదు యిధిస్తరట. గాడ గా సర్కారోల్లు గిట్ల బాజాప్తా ఓ జీవోనే తీసిండ్లంట. గా యీధి కుక్కలను కట్టడి శేయడాన్కి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని కూడా పత్యేకంగా పెట్టిండ్లంట. ఫస్టుసారి మనిషిని కర్సిన కుక్కను 10 రోజులు గా జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచుతరట. ఇగ గా కుక్కలకు మనుసుల్లెక్కనే టీకా యేస్తరట. గంతేగాదుల్ల.. దాని పెయిల ఓ మైక్రో చిప్‌ను పెట్టి, ఇగ గా కుక్కను బయటికి వదుల్తరు. ఇగ గా కుక్క రొండో సారి గిన యెవల్నన్న కరిసిందనుకోండ్లి. ఇగ గా కుక్కను గదే కేంద్రంల జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు చేసిండ్లంట.
గీడికే అయిపోలే. ఇగ గా కుక్క కాటు యేసిందా? లేదా? యాడేసింది? ఎంత లావు యేసిందనేదాన్ని గా సర్కారోల్ల పశుసంవర్ధక సాక అధికారులు, సుట్టుముట్టు ఉండే సంస్థల ప్రతినిధులు, ఎస్పీసీయే సభ్యుల కమిటీ ఒకటి దర్యాప్తు చేస్తదట. ఇగ గా దర్యాప్తుల కుక్క కర్సినట్లు పూర్తి ఆధారాలుంటేనే కుక్కకు గా జీవిత ఖైదు సిచ్చేస్తరట. లేకపోతే లేదట!
వోర్నీ…! గీ కుక్కల తక్కెడ సల్లగుండ… గింత పెద్దగున్నాది. గా సర్కారే గింత సేత్తాందంటే సేయదా మరి?. గా పొద్దు పెద్ద అదాలతోల్లు కుక్కలను కట్టడి సేయాల్సిందేనంటే, గా జంతు పేమికుల పేరుతోని గంతగనం గయ్! మని లేస్తిరి. గిదంతా సేయకపోతే ఎట్ల? అనుకున్నట్లున్నది గా సర్కరోల్లు. కుక్కలను ఒక్కతీర్గత కట్టడి సేయకపోతే, శాలనే కట్టాలున్నట్లున్నయి గద!

