ప్రకృతి మానవ జాతికి లభించిన గొప్ప వరం. ఈ సకల చరాచర ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రకృతే. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ, అదే ప్రకృతికి మనమేం ఇస్తున్నాం? విధ్వంసం, వినాశనం చేయడం తప్ప! ఆవిధ్వంసమే ఇప్పుడు మొత్తం కేవలం ప్రకృతికే కాదు స్రుష్టి వినాశనానికే దారి తీస్తున్నది. మొక్కే కదా అని పీకేస్తే, చెట్టే కదా అని తొలగిస్తే, చెత్తే కదా అని వేసేస్తే, పొగే కదా అని వదిలేస్తే, అంతా చేయట్లేదా? నేనొక్కరినే కాదు కదా! అని నిర్లక్ష్యం వహిస్తే, ఏర్పడుతున్న విలయం అంతా అంతా ఇంతా కాదు. తనను తాను ఉద్ధరించుకుంటేనే ఉద్యమమైనా, విప్లవమైనా, చివరకు మార్పైనా, మరేదైనా.|EDITORIALS
ప్రకృతిని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనుగడతోనే మన మనుగడ ఇమిడి ఉంది. భారతీయ సనాతన ధర్మం, సంస్క్రుతి, సంప్రదాయాలు మొత్తం ప్రకృతిని పూజించడం, ఆరాధించడంతోనే ముడిపడి ఉన్నాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోనే గాక, మన జీవన విధానంలోనూ పరంపరగా వస్తూ ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని లను పంచభూతాలు అన్నాం. జీవధాతువే పంచభూతాల్లో సజీవంగా ఉంది. అందుకే మనం మన భూమిని మనకు జన్మనిచ్చే తల్లితో సమానంగా చూస్తాం. భూమాత, భూతల్లి అంటున్నాం. నీటినిచ్చే నదులన్నింటికీ తల్లికి సమానమైన స్త్రీలింగంతో కూడిన పేర్లే పెట్టుకున్నాం. చివరకు ఉగాది, బతుకమ్మలాంటి దాదాపు అన్ని పండుగలు కూడా ప్రకృతి సంబంధమైనవే. ప్రకృతితో మానవాళిది, జీవకోటిది విడదీయలేని పెనవేసుకున్న పేగు బంధం. ప్రకృతిని పూజించుకోవడం, అవసరమైన మేరకు అనుభవించడం, రక్షించుకోవడం, జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించడమనే ప్రక్రియ మన జీవన విధానం చేసుకోవాలి. చెట్టును, పుట్టను పూజించడం వెనక ఉన్న మర్మం కూడా ఇదే.|EDITORIALS
నిజానికి మానవుడు భూమ్మీద పడినప్పటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. మిగతా జీవరాశిలో విధ్వంసం కంటే జీవ వైవిధ్యమే ఉంటుంది. ప్రకృతి బహుషా మనిషి చేసినంత వినాశనం మరే జీవి చేయడం లేదనే అతిశయోక్తి కానే కాదు. ఈనాటి సునామీ లాంటి ప్రళయాల నుంచి, అతివ్రుష్టి, అనావ్రుష్టి, కరువు కాటకాలు, ప్రాణాంతక, అంటువ్యాధులు ప్రబలడం వరకు అంతా ప్రకృతితో ముడిపడినవే. అంతెందుకు మనం పీల్చేగాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం కావడానికి మానవుడే అంటే మనమే కారణం. మానవ తప్పిదాల కారణంగా లేదా విధ్వంసం కారణంగా జీవజాతుల మనుగడ కూడా ప్రశ్నార్థకం అయింది. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవరాశుల్లో, వనరుల్లో, భూమి మీద సకల స్రుష్టిలోనే సమతౌల్యం దెబ్బతిని జీవవైవిధ్యం సర్వనాశనమై నశించిపోతోంది. జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపు కోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక థీమ్ తో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. కానీ, అది తత్ దినంలా మారి పోయింది.|EDITORIALS
భారతీయ సంస్కృతిలో భాగంగానే చెట్టు, చేమ, పశుపక్ష్యాదులను పూజించటం జరుగుతోంది. జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుషులకు చేదోడుగా ఉంటాయి. మనుషులతో మమేకమై జీవిస్తున్నాయి. ఇతర జంతుజాతులు కూడా ఒకదానిని ఒకటి ఆహారంగా తీసుకునే లక్షణం కారణంగా ఆయా జీవరాశుల వైవిధ్యం కూడా సమతౌల్యం అవుతున్నది. జీవ జాతుల జీవన క్రియల్లో విడుదల అయ్యే వ్యర్థాలు కూడా భూసారానికి ఉపయోగపడే విశిష్టత ప్రకృతిలోనే ఉండటం విశేషం. ఫలాలు, ఔషధ మొక్కలు, ఆహారాన్నిచ్చే మొక్కలు, వనరులు ఎంత అద్భుతమైనదీ స్రుష్టి. మానవ ఆహారం మొత్తం ప్రకృతి మనకు ఇస్తుంది. జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువ ఆవు. ఆవు పాలు, పేడ, మూత్రం, నెయ్యి ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవును పూజించే సంస్కారం బహుషా ఇందుకే ఏర్పడిందేమో.|EDITORIALS
పెరుగుతున్న భూతాపం, భూవ్మిూద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. అందుకే ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ సమతౌల్యాన్ని పాటించాలి. మనం కేవలం కొంత కాలం జీవించిపోవడానికి మాత్రమే ఈ భూమ్మీద జన్మించాం. మనకంటే ముందు తరాలు, మన తర్వాత తరాలు కూడా ఉంటాయి. మన ముందు తరాలు ప్రకృతిని కాపాడి మనకిచ్చారు కాబట్టే ఇవ్వాళ మనం బతికి బట్టకడుతున్నాం. అలాగే ఇంతకంటే మెరుగైన ప్రకృతిని అంటే జీవించే అవకాశాలను మనం మన తర్వాత తరాలకు ఇవ్వాలి. నిజానికి మనం ఇవ్వాళ మన పిల్లలకు సంపాదించి ఇస్తున్న ఆస్తుల కంటే కూడా పవిత్రమైన మెరుగైన ప్రకృతిని రక్షించి అందించడమే అన్నింటికంటే ముఖ్యం. జంతువులేవీ మనుషుల్లా ఆస్తులను కూడబెట్టడం లేదు. ఆలోచనలో, మాటలో తప్ప మనం జంతువులకంటే భిన్నమేమీ కాము. కానీ స్వార్థంతో, నిర్లక్ష్యంతో నీడనిచ్చే చెట్టునే నరక్కుంటున్నట్లుగా మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఈ స్రుష్టిని సర్వనాశనం చేసుకుంటున్నాం. అలాగే మన భివిష్యత్తును కూడా.|EDITORIALS

