భిన్నాభిప్రాయాలు, బేదాభిప్రాయాలు, రాజకీయా విభేదాలు ఏమున్నా, ఎన్ని ఉన్నా, దేశానికి సంబంధించిన అంశాల్లో మనమంతా ఒక్కటే! ముక్తకంఠంతో మనమంతా ఐక్యమే. అని చాటాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఎన్ని రకాల బాధ్యతలు, ఒత్తిడిలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల అనుమానాలను నివ్రుత్తి చేయాలి. ప్రతిపక్షాలు సైతం దేభద్రత, రక్షణకు సంబంధించిన అతి ముఖ్యమైన, సున్నితమైన అంశాల్లో సంయమనం పాటించాలి. తప్పితే, అధికార ప్రతిపక్షాల్లో ఉన్నవారు దేశం కంటే, ప్రజలకంటే ఎవరూ ముఖ్యం కాదు. అదే అసలైన దేశభక్తి. అదే అసలైన జాతీయత.|EDITORIALS
దేశ సార్వభౌమాధికారం విషయంలో ఎవ్వరైనా ఏకోన్ముఖంగా సాగాల్సిందే. ఒక్కటిగా ఉండాల్సిందే. అంతర్జాతీయ విషయాల్లో ఇది ప్రతిఫలించాలి. ఇటీవలి పాక్‌తో కాల్పుల ఘటనపై అందరూ ఒక్కతాటిపైనే ఉన్నారు. అయితే తర్వాత పరిణామాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు పలు అనుమానాలను లేవనెత్తాయి. పహల్గాం దాడి విషయంలో హిందువువేనా అని నిర్దారించుకుని కాల్పులు జరిపారు. దీనిపై కొందరు నేతలు అనుమానాలు లేవనెత్తారు. అదంతా ఉత్తిదేనని, అలాంటిదేవిూ జరగేలదని కొందరు అన్నారు. ఇప్పుడేమో ఖర్గే, అది చిన్న యుద్దమే అన్నారు. రాహుల్ మనవి ఎన్ని విమానాలు కూలాయని ఆరా తీస్తున్నారు. అంతేకాదు భారత్-పాకిస్తాన్ ఘర్షణలతో అర్థాంతరంగా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం వెనక కారణాలు చెప్పాలని కూడా కాంగ్రెస్, మిగతా కొన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ గోప్యతకి సంబంధించిన వ్యవహారాలు. కాదనలేం. కానీ, ప్రతిపక్షాలకు ఆ అనుమానాలు రేకెత్తే ఆస్కారం అధికార పక్షం లేదా ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు? అంతకుముందే అఖిలపక్షం పెట్టి, చెప్పదగిన సమాచారం ప్రతిపక్షాలకు వెల్లడి చేస్తే సరిపోయేది. ఆ తర్వాత కూడా ఆయా పార్టీలు వ్యక్తం చేస్తే, అది వారి ఖర్మకు వదిలేస్తే సరిపోయేది. పుండును చూసి ఉప్పు కారం చల్లడం ప్రధాని మోడీకి బాగా తెలిసిన విద్య. సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను దగ్గరకు తీసుకుంటున్న మోడీ వ్యూహాత్మకంగా శశిథరూర్ సామర్థ్యాన్ని విదేశీ దైత్యానికి వెళ్లే బృందంలో ఎంపిక చేసి కాంగ్రెస్ ను గిల్లుతున్నారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అనుభవం థరూర్‌కు ఉందన్నది వేరే విషయం.|EDITORIALS
ఇక అమెరికా తీరు కూడా హాస్యాస్పదంగా ఉంది. పాక్, భారత్ ఘర్షణలతో తమకు సంబంధం లేదంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా తామే రెండు దేశాలను ఒప్పించి, కాల్పుల విరమణకు దోహదం చేశామని చెప్పుకోవడం, తర్వాత తన ప్రమేయం లేదని ఒప్పుకోవడం విడ్డూరమే. అయితే ఈ విషయంలో మోడీ నోరు విప్పకపోవడం గమనిస్తే అనుమానాలు రేకెత్తడం సహజమే. అమెరికా అంత అకస్మాత్తుగా ఎందుకు కాల్పుల విరమణ జరపాలని రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చిందన్నది కూడా ముఖ్యమే. అదే అమెరికా ఇజ్రాయిల్‌ను, రష్యాను ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడి చేయలేక పోయింది. తన మాట వినకపోతే వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తామని బెదిరించడంతో రెండు దేశాలు దారికి వచ్చాయని స్వయంగా ట్రంప్ పేర్కొనడం గమనార్హం.|EDITORIALS
ఇదే సమయంలో పాకిస్తాన్ అణు స్థావరంగా భావిస్తున్న కిరానా హిల్స్ వద్ద భారత్ వైమానిక దళం క్షిపణులు ప్రయోగించడంతో అణుధార్మికత లీక్ అయిందని, దీంతో అమెరికా రంగంలోకి దిగి ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, అక్కడ అణు స్థావరం ఉన్నట్లు తమకు తెలియదని, ఆ ప్రాంతంలో అసలు తాము క్షిపణులనే ప్రయోగించలేదని భారత వైమానిక దళాధికారి స్పష్టం చేశారు. కిరానా హిల్స్ లో ఎలాంటి లీకేజీ లేదని ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. అసలు కిరానా హిల్స్ పై వస్తున్న వార్తలపై పాకిస్తాన్ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమవుతుండగా, కట్టడి చేసేందుకు భారత్ క్షిపణి ప్రయోగించిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. అణుదాడుల గురించి దాయాది దేశం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా తేల్చి చెప్పారు. మరోవైపు పాక్ అణుదాడి హెచ్చరికలను ప్రధాని మోడీ కూడా కొట్టిపారేశారు. ఇలాంటి హెచ్చరికలతో భారత్‌ను బెదరించలేదరని అన్నారు. కిరానా హిల్స్ ప్రాంతంలో అణ్వస్త్రాల స్థావరం ఉందని, రెండు దేశాల ఘర్షణ ఆ ప్రాంతానికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న భయంతోనే కాల్పుల విరమణ జరిగే విధంగా రెండు దేశాలకు అమెరికా నచ్చచెప్పే ప్రయత్నం చేసిందని భావించాల్సి వస్తుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన మాదిరిగా సుదీర్ఘంగా చర్చలతో కాలయాపన చేయకుండా తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ప్రయత్నం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఈ ఘర్షణలతో జరిగిన దాడులు, నష్టాల వివరాల గురించి పలువురు ఎంపీలు ప్రశ్నించగా ‘జాతీయ భద్రత’ దృష్ట్యా అటువంటి వివరాలు వెల్లడించలేమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొనడం గమనార్హం.|EDITORIALS
ఏదేమైనా ఇటీవల చోటు చేసుకున్న భారత్ పాకిస్థాన్ ఘర్షణలకు సంబంధించి ప్రభుత్వ వాదనను కాదనలేం. కానీ, వెల్లువెత్తుతున్న అనుమానాలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కనీసం తాము నిజాయితీగా దేశ రక్షణ కోసం పని చేస్తున్నామన్న భరోసాని, నమ్మికను కలిగించాలి. దేశ భద్రత ముడిపడి ఉన్న అంశాలపై ఎవరైనా సరే, ఆచితూచి మాట్లాడితే మంచిది. ఇలాంటి సమయంలో అనవసర వ్యాఖ్యలు చేసి ప్రపంచం ముందు మనం పలచన కావద్దు. మనలను మనం చులకన చేసుకోవద్దు. ఈ విషయంలో ఎవరైనా సరే సంయమనం పాటించాలి.|EDITORIALS

